నగర అభివృద్ధికి పాలకుల నిర్ణయాలే కీలకం. ప్రజల గురించి ఆలోచించే నాయకులు ఎన్నికవ్వాలంటే ఓటర్ల తీర్పే ముఖ్యం. స్థానిక ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకుని అలాంటి వారిని ఎన్నుకోవాలని, ఓటేసేందుకు అందరూ ముందుకు రావాలని విశాఖపట్నంలోని పలు ప్రాంతాల వాకర్స్ క్లబ్ సభ్యులు పిలుపునిచ్చారు. ఓటు హక్కు వినియోగంపై ‘న్యూస్‌టుడే’తో వారు తమ అభిప్రాయాలను పంచుకున్నారు.
వివిధ ప్రాంతాల వాకర్స్ అభిప్రాయాలు, సమస్యలు:
మాధవధార (ఇండస్ట్రియల్ ఎస్టేట్, త్రీ స్టార్ వాకర్స్ క్లబ్):
ప్రజాస్వామ్యంలో ఓటు వజ్రాయుధం లాంటిది. స్థానిక ఎన్నికల్లో ఓటు వేయడం ద్వారా కాలనీల్లోని సమస్యలను పరిష్కరించుకోవచ్చు. మన ప్రాంతాలను అభివృద్ధి చేసుకోవడానికి ఓటు హక్కును ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలి.
పీఎంపాలెం (తులసీనగర్ వాకర్స్ పార్కు):
హౌసింగ్ బోర్డు కాలనీలో మురుగు కాలువల వ్యవస్థను మెరుగుపరచాలి. విద్యుత్తు పనుల కోసం తవ్విన రోడ్లపై గోతులు తక్షణమే పూడ్చడంతో పాటు మురుగు కాలువల్లో పూడిక తొలగించాలి. ప్రజాసమస్యలు సమర్థవంతంగా పరిష్కరించగలిగే నాయకుడిని గెలిపించుకోవాలి.
ఎంవీపీకాలనీ (సెక్టార్-1 నేతాజీ పార్కు వాకర్స్):
స్థానిక సంస్థల్లో సరైన నాయకుడికి ఓటు వేసి, స్థానిక సమస్యలను పరిష్కరించేలా వారిపై ఒత్తిడి తెస్తాం. ఓటు వేయని వారికి పాలకులను ప్రశ్నించే హక్కు ఉండదు. చాలా మంది పోలింగ్ కేంద్రాలకు రాకపోవడం వల్లే అవినీతిపరులు, నేరస్థులు అధికారంలోకి వస్తున్నారు. ఇది నగర అభివృద్ధిపై తీవ్ర ప్రభావం చూపుతుంది.
వన్‌టౌన్, జగదాంబకూడలి (ఇందిరాప్రియదర్శిని స్టేడియం వాకర్స్):
పాతనగరంలో కాలుష్య నివారణపై ప్రత్యేక చర్యలు తీసుకోవాలి. ఎన్నికల బరిలో నిలిచే అభ్యర్థులు కాలుష్య నియంత్రణపై ప్రజలకు స్పష్టమైన హామీలు ఇవ్వాలి.
అడివివరం - సింహాచలం (పాత గోశాల కూడలి ఎస్వీఎల్ఎన్ వాకర్స్ క్లబ్):
ప్రజలకు మేలైన పాలన అందించే నిజమైన నాయకులను ఎన్నుకోవాలి. ఇందుకు ప్రతిఒక్కరూ ఓటుహక్కును సద్వినియోగం చేసుకోవాలి. ఓట్లు అడగడానికి ఇంటింటికీ వచ్చే నాయకులు.. ప్రజలకు మేలు చేయడంలోనూ అలాగే ముందుండాలి. ఎప్పటికప్పుడు ప్రజల సమస్యలను తెలుసుకుంటూ ఉండాలి.
ఆరిలోవ (ముడసర్లోవ వాకర్స్ అసోసియేషన్):
నగరంలో తాగునీటి కొరత సమస్య క్రమంగా పెరుగుతోంది. ఇటీవల తలెత్తిన పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని దీనికి శాశ్వత పరిష్కారం చూపాలి. ప్రధాన కూడళ్లలో రద్దీ నియంత్రణకు ఫ్రీ లెఫ్టులు, రోడ్ల విస్తరణ పనులు వేగవంతం చేయాలి. మంచి పాలకులను ఎన్నుకునేలా నగర ప్రజలంతా ఓటు హక్కును విధిగా వినియోగించుకోవాలి.
